కామేశ్వరరావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
మంత్రదర్శనాన్ని ఒక కవితగా వ్రాయాలన్న ఊహ అపూర్వం!
దర్శించిన దేవత పేరు కవితలో నేరుగా చెప్పకుండా నడిపించడం విశేషం. “తొలిపాటల కమ్మని పొందికమ్మ”, “మననజనావనకళా” – ఈ రెండూ ఈ కవి తన మాటలలో ఆ దేవి పేరుకు చేసిన అనువాదాలు. అన్వర్థాలు. అలా ఇది ఈ కవి దర్శనంకూడా అయింది.
“గొంతు తడియార, తడినిండ నంతరమున
మాట పెకలించె నెదనించి మౌనివరుడు.”
“వేదమయీ! చిగిర్చితివి వేల వసంతములైనయట్లు”
సమార్ద్రమైనభావాలు.
రెండు చిన్న సూచనలు:
“విశ్వాసప్రియే! రమ్మ!” అంటే మేలు.
“బుద్దికెందామర” అంటే బాగుంటుంది (బుద్ధికి వైకృత రూపం)
నా పద్యాలకు ఆనందించి స్పందించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
“జలపూర్ణకలశం” అన్నారు కనుక నప్పిందేమో!
అవునండి. వాజ అంటే నీరు అనే అర్థం ఉన్నది.
చింతనా అన్న మాట Monier-Williamsలోనూ లేదండీ.
దీర్ఘాంతరూపంకూడా ఉన్నదనుకుంటానండి. శబ్దరత్నాకరం దానిని దీర్ఘాంతంగానే పేర్కొంది.
“జననాథస్మరచింతనాపరవశస్వాంతంబునం” – చంద్రికాపరిణయం చ.ఆ.16, సురభి మాధవరాయలు
“…నిరంతర మాధవ చింతనా సము
త్సుకలలితాధరుండు…” – శ్రీనివాసప్రబంధము చ.ఆ.77 పుట్టపర్తి నారాయణాచార్యులు
రాబోయే భాగాలకై వేయికళ్లతో ఎదురుచూస్తాను.
శ్రీరామనాథ్ గారూ, మీ ఆత్మీయమైన మాటలు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. కాని మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి.
పద్యరచనాభ్యాసంగా ఏదో కొంత ప్రయత్నిస్తున్నాను తప్ప ప్రచురించాలన్న ఉద్దేశం లేదు. “మరల నిదేల రామాయణం బన్నచో… నా భక్తిరచనలు నావి కాన” – అని చెప్పగలనని నాకు అనిపించిననాడు తప్పక ప్రచురిస్తాను. అది ఎప్పుడు, ఎంతవరకూ సాధ్యమవుతుందో!
మంచిమంచి అన్నమయ్యపదాలను అందిస్తున్నారండి!
ఈ పాటలో నాకు నచ్చిన విశేషం ఏమిటంటే - దూతిక, ఉత్తరాన్ని ఉన్నదున్నట్టు చదవకుండా, తాను చదివి దాన్ని వ్యాఖ్యానిస్తూ అమ్మవారికి చెప్పడం. అయ్యవారి ప్రేమలేఖను అమ్మవారికి చదివి వినిపించాలంటే ఆ దూతికకు అమ్మవారిదగ్గర ఎంత చనవుండాలి! ఆ చనవంతా పాటలో వినిపిస్తుంది. ఆ గొంతులో, అత్యంత ప్రియులైన నెచ్చెలులు చేసే వేళాకోళం కూడా చక్కగా ధ్వనిస్తోంది! ఈ కీర్తనలో అన్నమయ్య, నెచ్చెలి అవతారమెత్తి తన అద్భుత నటనని మాటల ద్వారా మన కళ్ళకు కట్టించాడు.
సుమనిగారూ,
ఒక చిన్న కరెక్షన్. సిలబల్ తెలుగులో "మాత్ర" కాదు, "అక్షరం". మీరిచ్చిన ఉదాహరణలో Pen - పెన్ అన్న పదంలో ఉన్నది ఒక అక్షరం, రెండు మాత్రలు. అలాగే "Splendid" - "స్ప్లెండిడ్"లో ఉన్న అక్షరాలు 2, మాత్రలు 4. ఇంగ్లీషు పదాన్ని తెలుగు లిపిలో రాస్తే తెలుగులో వచ్చే అక్షరాలు సరిగ్గా ఇంగ్లీషు పదంలోని Syllablesతో సరిపోతాయి.
వెంకటాచార్యులుగారూ,
ఈ సమస్యని నేను చిన్న తేడాతో విన్నాను. "గరుడుడు గణపతికి తండ్రి గావలె సుమ్మీ". దీనికి క్రమాలంకారం కాకుండా ఇంకా సరసమైన పూరణ ఉంది.
నరసింహగారు,
నేనెత్తిచూపినవన్నీ ఛందః, వ్యాకరణ భంగాలు. వాటికి నేను ఊహించిన దిద్దుబాట్లు. పద్యం 1, 4, 35 నేను సూచించిన చోట్ల గణాలు సరిపోవడం లేదు. పుస్తకంలోనే అలా ఉందంటే అక్కడే అచ్చుతప్పులు పడి ఉంటాయి!
వీలు చిక్కినప్పుడల్లా చదువుతున్నాను. చదివినప్పుడు ఇలాంటివేమైనా కనిపిస్తే చెప్తాను.
నాకు కనిపించిన కొన్ని అచ్చుతప్పులు:
పద్యం 1: నా పలుకు లాలించి - నా పలుకుల నాలించి
పద్యం 4: బుద్ధి , జ్ఞాన , సమ్మోహములును - బుద్ధి జ్ఞానము సమ్మోహములును
పద్యం 6: తేటగీతి - కందం
పద్యం 7: తేటగీతి - కందం
పద్యం 17: ద్వాదశాదిత్యులందు విష్ణువౌదు నేనె - ద్వాదశాదిత్యులన్ విష్ణువౌదు నేనె
పద్యం 19: యక్షరాక్షసులం దలకాపతిని - ?
పద్యం 21: మహిత ఋషులందు నే భృగు నౌదు పార్థ ! - యతి కుదిరినట్టు లేదు?
పద్యం 28: ఆది మధ్యంతములు - ఆది మధ్యాంతములు
పద్యం 30: భవితముల కెల్ల హేతువు నగుదు నేనె - యతి కుదిరినట్టు లేదు?
పద్యం 35: నా భూతికి - నా విభూతికి
త.క - "ఌ" కి "ఉ"తో యతి పాత కవులు కూడా కొందరు వేసారు. అంచేత అది తప్పేమీ కాదు :-)
మేముంటున్నది చెన్నైలోనండి, అంచేత తెలుగు పద్యాలు కంఠస్థం చేయించమని స్కూలువారిని అడగడం కుదరదు :-)
మా పాప చదువుతున్నది చిన్మయ విద్యాలయ. వాళ్ళు చదువుతో బాటు మన సంస్కృతి గురించి బాగానే శ్రద్ధ తీసుకుంటున్నారు. పుట్టిన రోజు పాటలు సంస్కృతంలో (ఒకోసారి తమిళంలో) పాడతారు! మొన్నొక రోజు వాళ్ళు డ్రిల్లు చెయ్యడం చూసాను. అందులో మామూలుగా చేతులు ఎత్తి దించడానికి, "Up, Down" పదాల బదులు, "ఆకాశ్", "పృథ్వీ", "పాతాళ్" అని చెపుతూ ఉంటే చూసి నోరువెళ్ళ బెట్టాను :-)
పద్య ఛందస్సుని ఎవరో సరి చేసినట్టున్నారు. ఇప్పుడు సరిగానే ఉన్నాయి.
మా అమ్మాయి బళ్ళో ప్రతి సంవత్సరం భగవద్గీతలోని ఒకొక్క అధ్యాయంలో నుంచి కొన్ని శ్లోకాలు కంఠస్థం చేయిస్తూ ఉంటారు. గీతా ఛాంటింగ్ అని పోటిలు కుడా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ నవమోధ్యాయం, మొదటి పది శ్లోకాలు.
వీటికిలా తెలుగు అనువాదం చదవడం ఆనందంగా ఉంది!
పద్యం 9 - కందం కాదు తేటగీతి
పద్యం 29 - ఆటవెలది కాదు తేటగీతి
పద్యాలు చాలా బావున్నాయి. ఓపికతో అన్నిటినీ ఇక్కడ పెడుతున్నందుకు ధన్యవాదాలు.
పాఠ్యపుస్తకాలలో పెట్టాలన్న మీ ఆలోచన బాగుంది కాని, మన "సెక్యులర్" దేశంలో అది సాధ్యం కాదేమో!
పద్యాలున్న నిలువు గడి ఇంకా పెద్దది చేసి, తాత్పర్యం ఉన్న నిలువు గడి తగ్గిస్తే బాగుంటుంది. నా లేప్ టాప్ లో పద్యపాదాలు ఒకే లైనులో కనిపించడం లేదు.
రాయి అన్నదానికి ద్రవిడ భాషా మూలం "అఱై" - అంటే నూఱడం, నూఱడానికి ఉపయోగించే రాయి.
"ఓరకంట"లో "ఓర" అంటే ఒకటి అనికాదు. దీనికి కొస, అంచు, వాలు మొదలైన అర్థాలు.
తెలుగు భాష కూడా తమిళంలానే ద్రవిడ భాషనుంచి పుట్టింది కాబట్టి చాలా పదాలకి ద్రవిడ భాషలో మూలాలు కనిపిస్తాయి. తమిళ భాషలో కన్నా తెలుగులో ఎక్కువ మార్పు కనిపిస్తుంది. కాబట్టి కొన్ని పదాలు తమిళం నుండి వచ్చాయని భ్రమపడుతూ ఉంటాం. "ఒరు", "కల్లు" కూడా అలాంటివే.
అచ్చమైన (ద్రవిడ భాషా మూలం కనిపించని) తెలుగు పదానికి ఒక ఉదాహరణ "నోరు" అనుకుంటాను.