కొడవళ్ళ హనుమంతరావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
నేను వేదాలనీ ఉపనిషత్తులనీ మధించలేదు కాని, వాటినీ సాపేక్ష సిద్ధాంతాలనీ తరచి చూచిన నండూరి “విశ్వరూపం” లో అంటారు:
“ప్రాచీన హిందువులు ఖగోళ విజ్ఞానంలో ఆరితేరినవారే. కాని వారి విజ్ఞానం ఎంత ప్రాచీనమైనదనే విషయం ఈనాటికి కూడా వివాదగ్రస్తంగా వున్నది. మన సంప్రదాయం ప్రకారం మన నాగరికత అతి పురాతనం. మన ఖగోళ విజ్ఞానం కూడా అతి ప్రాచీనమైనదే. అసలు ఖగోళ విజ్ఞానమే కాదు, ఏ విజ్ఞానమైనా ముందు భారతదేశంలోనే పుట్టి ఇతర దేశాలకు వ్యాపించిందని వాదించే ఛాందసులు పలువురున్నారు. వారి దృష్టిలో అసలు ఈనాడు పాశ్చాత్యవేత్తలు కనిపెట్టిన కొత్త విషయం ఒక్కటీ లేదు. ఏ పాశ్చాత్యుడు ఏ నూత్న విషయాన్ని ప్రతిపాదించినా, అది మన వేదాలలోనే వున్నదంటారు. ఏదో శ్లోకాన్ని తీసుకుని దానికి నూత్న సిద్ధాంతానుగుణమైన అర్థం చెబుతారు. ఇంతేకాక, పాశ్చాత్యులు ఈనాటికీ కనిపెట్టలేని ఎన్నో మహత్తర విశేషాలు వేదాలలో వున్నాయని, వేదాలు అపౌరుషేయాలు కనుక మన విజ్ఞానం అనాది అని చెబుతారు. ఇది ఒక విధమైన జాత్యహంకారం.”
సృష్టి ఆవిర్భావం మీద ఆసక్తి కలవాళ్ళు నండూరి, Weinberg [1] రచనలు చదవాలి.
కొడవళ్ళ హనుమంతరావు
[1] The First Three Minutes: A Modern View of the Origin of the Universe. Steven Weinberg. Basic Books. 1993.
“చెల్లియుండియు సైరణ చేయునతడు” అన్న భారత సూక్తి ఏ సందర్భంలోదని వెదుకుతుండగా, ఈ వ్యాసం 2022 ఏప్రిల్ “కొలిమి” లోనిదని తెలిసింది. “ఈమాట” ఆమాట చెప్పాల్సింది.
“చెల్లియుండియు సైరణ సేయునతఁడుఁ
బేదవడియును నర్థికిఁ బ్రియముతోడఁ
దనకుఁ గలభంగి నిచ్చునతండుఁ బుణ్య
పురుషు లని చెప్పి రార్యులు గురువరేణ్య.”
దానికి రెండు పద్యాల ముందరిది:
“క్షమియించువారిఁ గని చా
లమి వెట్టుదు రైననుం దలంప ననూన
క్షమయ కడు మెఱయుతొడ వు
త్తమరూపము గోరువారు దాల్తురు దానిన్.”
(ఉద్యోగపర్వం, రెండో ఆశ్వాసం)
ధృతరాష్ట్రుడికి విదురుడు హితోపదేశం చేసే సందర్భం లోని ఈ పద్యాల సారాంశం: సమర్థుడయి (చెల్లియు) కూడా శాంతం (సైరణ) వహించేవాడు పుణ్యపురుషుడు; క్షమించే స్వభావం కలవాళ్లకి జనులు అసమర్థతని ఆపాదిస్తారు (చాలమి+పెట్టుదురు) కాని, ఆలోచిస్తే క్షమాగుణమే మిక్కిలి మెరిసే ఆభరణం.
రాజేశ్వరి పొందిన “లోపలి స్వేచ్చ” వలన కలిగిన క్షమ, ఓరిమి ఆమెకు ఆత్మవైశాల్యాన్ని చేకూర్చాయని వాడ్రేవు గారి ప్రశంస.
అమీర్ కి మరొక స్త్రీ పై మోజు పడితే వారినిరువురినీ కలిపిన రాజేశ్వరిది ప్రకాశించే క్షమా? కడుపుతో ఉన్నప్పుడు కర్రతో బాదితే, తన్నితే సహించడం మెచ్చుకోదగ్గ ఓరిమా? బిడ్డని కనాలని ఉన్నా అమీర్ కోసం గర్భం పోగొట్టుకోవడం స్వాతంత్రమా? ఇదంతా తను సంపాదించిన “లోపలి స్వేచ్చ” వలనే అనడం విడ్డూరంగా ఉంది; కాదు, చాలా ఎబ్బెట్టుగా ఉంది. కొడవటిగంటి 1947 లో రాసిన “ఆడబ్రతుకే మధురం!” () అన్న కథలో పిల్ల అంటుంది: ” నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుణ్ణి మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడాపాయె.” ఓ చిన్న పిల్లకున్న స్వాభిమానం కూడా రాజేశ్వరి చూపించలేదే?
ఇంతకీ తన 2002 సిద్ధాంత వ్యాసంలో [1], “మైదానంలో వ్యక్తి స్వేచ్చ గురించి మాట్లాడలేదు,” అని, ఇప్పుడీ “లోపలి స్వేచ్చ” సిద్ధాంతం తేవడమెందుకు?
వాడ్రేవు గారు [1] కి అనుబంధంగా ఇస్మాయిల్ తో చేసిన ఇంటర్వ్యూ లో ఓ చక్కని జవాబుంది:
ప్ర. స్త్రీవాదులు చలంలో తమకు అవసరమైనది తీసుకుని శతజయంతులు జరపడం మీద మీ ఉద్దేశ్యం ఏమిటి?
జ. చలం ఒక మహా కాసారం. అందులో స్వచ్ఛమైన జలముంది. అందమైన తామరలున్నాయి. రుచికరమైన చేపలున్నాయి. పచ్చటి నాచుంది. ఎవరికి అవరమైనది వారు తీసుకుంటారు.
అలాగే “మైదానం” లో విశాలమైన పచ్చటి బయళ్లతో పాటు కొన్ని కలుపుమొక్కలున్నాయి. వాటిని వివరించే జయప్రభ వ్యాసం “మైదానానికి చెలియలి కట్ట” [2] () చదవదగ్గది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “సత్యాన్వేషి చలం: ఒక పరిశీలన,” డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి. 2006. (పి.హెచ్.డి. సిద్ధాంత వ్యాసం, 2002).
[2] “మార్గము – మార్గణము (సాహిత్య వ్యాసాలు),” జయప్రభ. 2003.