వెంకట రాజారావు . లక్కాకుల తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

తెలుగు పద్యం;వెంకట రాజారావు . లక్కాకుల

చదివితి నేనుగూడ , కడు సంతసమాయె గతమ్ము త్రవ్వగా ,<br />మదికి లయించునట్టు లలనాటి మహాత్ములు బోధచేసి , రా<br />చదురులు ఙ్ఞప్తిచేసితిరి , చాల ఘనంబు , కృతఙ్ఞతాంజలుల్ 🙏,<br />పదె పదె నాటి పద్యములు భావన జేతుము గాదె !యిప్పుడున్ .

19 April 2025 7:12 PM

కష్టేఫలి;వెంకట రాజారావు . లక్కాకుల

శిఖిపింఛ వలయిత శీర్ష కుంతలభార
విపినప్రసూనాక్ష వీక్షితుండు
గిరిధాతు చిత్రిత తిరుతిలక మనోఙ్ఞ
వర రుచిర నిటల వర్ణితుండు
అమృత మ్మొలుక వేణు వనయమ్ము మ్రోయించు
లావణ్య రూప విలాసితుండు
బాల తమాల వినీల మంగళ తనూ
ప్రభల చెలంగు పరాత్పరుండు

నందబాలుండు , కృష్ణుండు , నగధరుండు
వాసుదేవుండు , గోగోప వర సఖుండు
గరిమ గీతోపదేశ జగద్గురుండు
మదిని సాక్షాత్కరించె నమస్కరింతు .

17 April 2025 12:23 PM

సమస్యల'తో 'రణం('పూ'రణం);వెంకట రాజారావు . లక్కాకుల

వయసుడిగిన మేను వార్ధక్యమున జిక్కి
పూని చాకిరి చేయలేని నాడు
బుధ్ధి పటుత్వము పోయి , మతిమరుపు
చేరి సహాయము కోరు నాడు
ముదిమి తోబాటుగా నెదుగు రోగాలకు
వైద్యావసరము కావలయునాడు
మలిసంధ్య చీకట్ల మనుగడ మసకలో
కలగుండు పడు కష్ట మొలుకు నాడు

అమ్మ " నొక బిడ్డ " గా జూడ సమ్మతించి
కాచి కడతేర్చు బిడ్డలు గలర ? అంత
గాక పోయిన బాధ్యతగా దలంచి
జాలి చూపించ గలర ? కాస్తంత యైన

" మాతృపిండం దదామ్యహ " మన్న మాత్ర
ఋణము తీరదు , ముదిమి పైకొనిన నాడు
కాచి కడతేర్చ తీరు _ నీ ఘనత మరచి
ఎన్ని పిండాలు పెట్టిన నేమి ఫలము ?

16 April 2025 10:57 AM

కష్టేఫలి;వెంకట రాజారావు . లక్కాకుల

అలిసి , విశ్రాంతి గైకొను నవసరమున ,
ఎవ్వరిష్టము వారిది , ఏది తగునొ -
ఏది తగదొ - మనమెవరము , ఇట్లు వ్యాఖ్య
చేసి యెగతాళి సలుప ? వ్రాసినత డెవరు ?

15 April 2025 11:42 AM

కష్టేఫలి;వెంకట రాజారావు . లక్కాకుల

నగుమోము నిగనిగల్ ధగధగా మెరయు నీ
సొగసుజూడ తరమా జగ దధీశ !
ఆడు తుమ్మెద రెక్క నడచు వినీల నీ
సొగసుజూడ తరమా జగ దధీశ !
మగశిఖి పింఛంపు మౌళి జిలుగుల నీ
సొగసు జూడ తరమా జగ దధీశ !
రమణుల మధ్య చేర నవ మోహనపు నీ
సొగసు జూడ తరమా జగ దధీశ !

నంద గోపబాల! నగధర !గోవింద!
కృష్ణ! హరి! ముకుంద! కేశ !వాచ్యు
త! మురళీధరా! జిత మదన రూప! నీ
సొగసు జూడ తరమ జగ దధీశ !

15 April 2025 9:55 AM

కష్టేఫలి;వెంకట రాజారావు . లక్కాకుల

పరమాత్మ సంస్తుతి వినగ
పరమానందము గలిగెడు భాగవత బుధా !
తరమగు పనియే గద ! గురు
వర ! పనిమాలిన పనియని భావింపరుగా !

13 April 2025 6:17 PM

వరూధిని;వెంకట రాజారావు . లక్కాకుల

గురు వరూధిని చెప్పేది యెరుక పడల ! ,
పండితు లిలాగె అర్థమవని విథముగ
ఆన తిచ్చెదర ? , అసలు భావాన పలికి
ఈ శిశువులను రక్షింతురేమి , బుధులు !

11 April 2025 6:07 PM

వరూధిని;వెంకట రాజారావు . లక్కాకుల

సుబ్బరాయుడుగారి మేనుబ్బ , షేర్లు
ఇబ్బడిగ ముబ్బడిగ కొని రేమి ఖర్మ !
ట్రంపు తిక్కకు సొమ్ము శ్రీరస్తు గాగ ,
రోదనము తప్పదాయె తీరుబడి గాగ .

08 April 2025 11:57 AM

వరూధిని;వెంకట రాజారావు . లక్కాకుల

కళ్యాణ రామయ్య కమనీయ నుదిటిపై
తిరుమణి దిద్దెను తరుణి యొర్తు ,
భాషికములు గట్టె యోష యొకర్తుక ,
చుక్క యొకతె బుగ్గచుక్కవెట్టె ,
కంఠహారమ్ములు కైసేసె యోర్తుక ,
వనమాల దిగవేసె వనిత యొకతె ,
ముత్యాల తలపాగ మురువుగా తా దీర్చె
కడు మనోఙ్ఞముగాగ పడతి యొకతె ,

పెండ్లి కొడుకైన రామయ్య పేర్మి గనగ ,
రామచక్కగ నున్నాడు రాజ సుతుడు ,
రెండు కన్నులు చాలవు , నిండు చంద్రు
దివ్య మంగళ మూర్తిని , తేరి చూడ .

06 April 2025 10:59 AM

నవ రస(జ్ఞ) భరితం;వెంకట రాజారావు . లక్కాకుల

వ్యాసం బెంతేన్ హృదయ గతమై హాయి గూర్చెన్ రసఙ్ఞా !
వ్రాసెన్ కావ్యంబు రసధునులన్ పార్చి , కావ్యాత్మ ధీ సం
కాసం బొందన్ , మధురముగ శ్రీ కాళిదాసుండు , భావా
వాసంబుల్ ఇర్వురను నిలిచెన్ వాక్కులో , యుక్తిలోనున్ .

26 March 2025 12:27 PM

కవి'తల' అలలు;వెంకట రాజారావు . లక్కాకుల

భావుకత లేని మనిషి ఓ మట్టిముద్ద
భావుకతయే కవితకు ప్రాణ ప్రదము
భావుకత నుండియే కవి ప్రభవ మొందు
కవిత సుధలోన కరుగదు కరకు గుండె .

24 March 2025 11:35 AM

నవ రస(జ్ఞ) భరితం;వెంకట రాజారావు . లక్కాకుల

కనగ కశ్మీరు చిలకమ్మ కళలు , మాకు
నవరసజ్ఞభరితమయ్యె , కవుల భావు
కతలు చదువ , నింత ఘనత గల తలమ్ము
గలదె ? కశ్మీరు గాక , భూతలము నందు .

23 March 2025 8:05 AM

బోల్డన్ని కబుర్లు...;వెంకట రాజారావు . లక్కాకుల

పురుషోత్తముడని రాముని ,
తరుణీమణి యని జగంబు ధరణిజను , మహ
త్తర లోకోధ్ధరణ కొఱకు
ధరపయి జన్మించిరనుచు , తాపసు లనరే .

11 March 2025 10:19 AM

nmraobandi;వెంకట రాజారావు . లక్కాకుల

ముందుగా వారికి వినిపించే ,
ఇక్కడ ప్రకటిస్తున్నారేమో సార్ !

09 March 2025 12:32 PM

nmraobandi;వెంకట రాజారావు . లక్కాకుల

అరయ 'పాజిటివ్ థింకింగు' అనగ నిదియ !?
వయ సరవయి దాటె , మనసు పరుగు బెట్టె
చందమామ కోసి చెలికి విందు సేయ
ఓహొ ! మా బండిసారు భళే హుషారు 👍 .

08 March 2025 10:51 AM

స్మరణ;వెంకట రాజారావు . లక్కాకుల

రాముడు తన అంశే కదా !
ఐనా ,
శంఖ చక్ర గదా ధారియై ఉన్నప్పటి
తన రూపం కంటే ,
ధనుర్బాణాలు దాల్చిన రామచంద్రుని
తన రూపం మోహనంగా కన్నార్పనీ
య లేదు ( కన్నార్పకపోవడం దేవతల లక్షణం . ఆ లక్షణముతోనే
దొరికిపోయాడు) ఇందు పరీక్షించడం
అనే అంశమే తలెత్తదు .
రామచంద్రుని లోకోత్తర రూప లావణ్యమే ప్రతిపాదితము .

16 February 2025 12:10 PM

స్మరణ;వెంకట రాజారావు . లక్కాకుల

చెప్పగా విని , ' హరి ' రాము , జేరి చూచి ,
ధనువు బాణాలు దాల్చిన ధర్మమూర్తి
మోహనతలకు ముగ్ధుడై , ముచ్చట పడి
తాను నటువలె మారి , యా దారి నడచె ,

అచ్చు గుద్దిన రూపంబు లచ్చుపడగ
మోహనాకార సంశోభ మూర్తిమత్త్వ
రాములను గాంచి , ' అనిమిష' ద్రమణు డగుట ,
దొంగ రాముడు సీతకు దొరికి పోయె .

(మునులు త్రిజగన్మోహనుడైన శ్రీరామ చంద్రుని
రూప గుణ యశో విభవాలను గూర్చి చెప్పుకొను
చుండగా శ్రీ మహా విష్ణువు విన్నాడు .
ఆ దివ్య మనోహర రూపాన్ని చూడాలనుకున్నాడు .
వెంటనే భూలోకం చేరి సీతాలక్ష్మణసమేతంగా
నడచి వెళుతున్న ఆ ధనుర్ధారిని దూరం నుంచి
చూసేడు .
దేవతలను కూడా కన్నార్పనీని ఇంత మోహనమా!
అని ఆశ్చర్యంలో మునిగేడు . అతడి తలపులో ఒక
చిలిపి ఆలోచన మెదిలింది .
అనుకున్న తడవే రామచంద్రుని రూపంలోకి మారి
ప్రక్కన నడువ సాగేడు .
సీతకు రామచంద్రుని రెండు మూర్తులు కన్పిస్తున్నవి . అచ్చుగుద్దినట్లు ఒకే పోలికతో కన్పిస్తు
న్నారు . తీక్షణంగా గమనించింది . ఒకరికి కను
రెప్పలు పడడం లేదు . దొంగరాముడు దొరికి
పోయేడు . ఆయనకు సభక్తిగా నమస్కరించింది .
శంఖ చక్ర గదా ధారియై శ్రీమహా విష్ణువు ప్రత్య
క్షమై , ఆశీర్వదించి అంతర్దాన మయ్యేడు .)
స్వస్తి

15 February 2025 9:42 PM

nmraobandi;వెంకట రాజారావు . లక్కాకుల

రంగాజమ్మ అంతగొప్ప కవయిత్రి మరి .
ఆమాత్రం అతిశయం ఉండవలసిందే
సారూ !

15 February 2025 11:04 AM

nmraobandi;వెంకట రాజారావు . లక్కాకుల

ఏ వనితల్ మమువ్ దలప నేమిపనో ? తమ రాడువారు గా
రో ? వలపించు నేర్పెరుగరో ? తమ కౌగిలిలోన నుండగా ,
రావది యేమిరా ! విజయరాఘవ ! యం చిలు దూరి , బల్మిచే
దీవర కత్తెనై పెనగి తీకుకవచ్చితినా ? తలోదరీ !

ఈ పద్యంతో ముడివడిన ఐతిహ్యం జ్ఞాపకం
వచ్చింది . పద్యంలోని కథానాయకి యెంత
గడుసరో , పాట లల్లడంలో బండిదొర లంత
గడుసరి .

15 February 2025 9:55 AM

nmraobandi;వెంకట రాజారావు . లక్కాకుల

విను పెద్దన్నయ్యో "వినరా " ఇదీ

సారూ ,
ఎవరి ..... నుద్దే .....శించో ..... కాదుగదా

14 February 2025 4:52 PM