కొడవళ్ళ హనుమంతరావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;కొడవళ్ళ హనుమంతరావు

మెచ్చుకొని ప్రోత్సహిస్తున్నందుకు శ్రీనివాస్, రమేష్, వేమూరి గార్లకి, జర్మన్ పేర్ల స్పెల్లింగ్ లను సరిదిద్దినందుకు పరుచూరి శ్రీనివాస్ గారికి, ఈ వ్యాస పరంపరని ప్రచురించడంలో నాకు తోడుగా శ్రమిస్తున్న సంపాదకురాలు ఇంద్రగంటి పద్మ గారికి కృతజ్ఞతలు.

ఎవరికైనా వివరించగలిగితేనే గాని మనకు అసలు విషయం అర్థమైనట్లు కాదనే నిజం, నాకీ వ్యాసం గురించి ఆలోచించినప్పుడు అనుభవంలోకొచ్చింది. దీని గురించి దాదాపు సంవత్సరం పైగా ఆందోళన పడ్డాను. ప్లాంక్ ప్రఖ్యాత ఫార్ములా తెలిసిందే అయినా, దానిని ఆయన ఎలా కనుక్కున్నాడన్న దానిపై నాకు సరైన అవగాహన లేదు. నా డిగ్రీ రోజుల్లో దీని గురించి చదివానో లేదో కూడా గుర్తు లేదు. ఇంత ముఖ్యమైన విషయం గురించి సైన్స్ లో డిగ్రీలు సంపాదించిన నాకే మిడిమిడి జ్ఞానం మించి లేనందుకు విచారించాను.

నేను Amherst లో చదువుతున్నప్పుడు 1985లో కొన్న Gamow పుస్తకం [1] ఇప్పటికీ భద్రంగా ఉంది. అయితే, చాలా పాపులర్ సైన్స్ పుస్తకాలలో ఉన్నట్లే, దాంట్లోనూ ప్లాంక్ ఎలా కనుక్కున్నాడో వివరాలు లేవు. దీని గురించి నాకన్నా పాతికేళ్ళు చిన్నవాడైన ఓ మరాఠీ స్నేహితుణ్ణి అడిగాను. ఆ డెరివేషన్ తనకూ తెలియదు గాని, Jayant Narlikar ఒక ఉపన్యాసంలో ప్లాంక్ దీనిని accidental గా కనుగొన్నట్లు చెప్పినట్లు గుర్తుందన్నాడు.

Abraham Pais పుస్తకం చదివితే గాని ఆవిష్కరణ వెనుక ఉన్న అసలైన చారిత్రక నేపథ్యం, నాటి ప్రయోగశాల పరిశోధకుల విశిష్టత, ప్లాంక్ “act of desperation” తెలియలేదు. ఆ చారిత్రక కథని ఎలాగైనా పాఠకులతో పంచుకోవాలనే ఆకాంక్షతో శ్రమపడ్డాను. ఫలించినందుకు సంతోషం. నా అజ్ఞానం కొంతయినా తొలగినందుకు తృప్తి.

కొడవళ్ళ హనుమంతరావు

[1] George Gamow. Thirty Years that Shook Physics: The Story of Quantum Theory. Dover Publications. 1966.


05 July 2026 6:25 AM

ఈమాట;కొడవళ్ళ హనుమంతరావు

బహుభాషా పాండిత్యంతో పాటు సాహిత్యం, తత్వశాస్త్రాలలో ప్రావీణ్యం ఉన్న సూరపరాజు గారి రచనలు చదవదగ్గవి. హైడెగర్ అంత సులువుగా బోధపడడు; అందుకు కొంతవరకు అతను వాడే క్లిష్టమైన పరిభాష కారణం. తెలుగులో హైడెగర్ మీద నాన్-అకడమిక్ రచనలు అరుదు; నాకు తెలిసి, వాడ్రేవు “సత్యాన్వేషణ” లోని “” సంక్షిప్త అనువాదమొక్కటే.

కేవలం కొన్ని ఉల్లేఖనలతో మాత్రమే హైడెగర్ దర్శనాన్ని గ్రహించలేము; వచ్చే వ్యాసాల కోసం ఎదురుచూడాలి.

ప్రస్తుత వ్యాసంలోని కాలరేఖలకి కొన్ని మార్పులు చేర్పులు:

1919: కాథలిక్ మతాన్ని వదిలింది 1913లో కాదు, 1919లో మొదటి సంతానం కలిగిన తర్వాతే.

1923: బ్లాక్ ఫారెస్ట్ (Black Forest) కొండల్లో కుటీర (Todtnauberg cabin) నివాసం. అతని మాగ్నమ్ ఓపస్, బీయింగ్ అండ్ టైమ్ (Being and Time), రచన ఇక్కడే.

1931-32: నాజీ పార్టీ భావజాలం వైపు మొగ్గు.

1933 ఏప్రిల్: ఫ్రైబర్గ్ విశ్వవిద్యాలయానికి రెక్టర్‌గా నియామకం. ఆ వెంటనే మే నెలలో నాజీ పార్టీ సభ్యత్వం. అయితే, సంవత్సరం తిరక్కుండానే నాజీ పార్టీ అనుయాయులతో, తోటి ఆచార్యులతో విభేదాలు రావడంతో రెక్టర్ పదవికి రాజీనామా. కానీ ప్రొఫెసర్‌గా కొనసాగింపు.

1945: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రెంచ్ సైన్యం ఆక్రమణ, ‘Denazification’ కమిటీ విచారణ. ఫలితంగా 1949 వరకు బోధన నుండి బహిష్కరణ.

హైడెగర్ బహిరంగంగా ఎప్పుడూ తన నాజీ అనుకూలత గురించి మాట్లాడలేదు. యూదుల మారణహోమం (Holocaust) గురించి ఒక్క మాటైనా మాట్లాడి సంజాయిషీ ఇస్తాడని కొందరు ఆశించారు. కానీ అతను మౌనం వహించాడు. బహుశా దానికి తను బాధ్యుడిని కానని.

ఈ సందర్భంలో ఒక సాహిత్య ప్రస్తావన. 1967లో ప్రసిద్ధ యూదు కవి Paul Celan హైడెగర్ కుటీరాన్ని సందర్శించాడు. (ఇతని ప్రఖ్యాత కవిత ‘Todesfuge’ కి తమ్మినేని అనువాదం ““). ఆ పర్యటన తర్వాత, హైడెగర్ నోట ఓ మాట (“for a thinker’s word to come, in the heart”) కోసం ఎదురుచూడటంపై Celan రాసిన కవిత ‘‘.

1966లో డెర్ స్పీగెల్ (Der Spiegel) పత్రికకు తను చనిపోయిన తర్వాత ప్రచురించాలనే నిబంధనపై ఇచ్చిన యింటర్వ్యూ ““. ఆధునిక టెక్నాలజీ మూలంగా మానవుడి జీవితం సహజత్వాన్ని కోల్పోతోందని వగచాడు:

స్పీగెల్: “కానీ ఒకరు చాలా అమాయకంగా ఇలా ప్రశ్నించవచ్చు. అంతా సజావుగానే నడుస్తోంది కదా. విద్యుత్ కేంద్రాలు పెరుగుతున్నాయి, ఉత్పత్తి పెరుగుతోంది. సాంకేతికంగా ముందంజలో ఉన్న దేశాల్లో ప్రజలు సుఖంగా ఉన్నారు. మనం సుసంపన్నమైన కాలంలో జీవిస్తున్నాం. మరి మనకు లోపించిందేమిటి?”

హైడెగర్: “అవును, అంతా సజావుగా నడుస్తోంది. ఆ సజావుగా నడవడమే ప్రతిదాన్నీ మరింత యాంత్రికత వైపు వేగంగా నెడుతోంది. ఈ సాంకేతికత మానవుడిని క్రమంగా తన నేల నుండి, మూలాల నుండి వేరుచేస్తోంది. కొద్దిరోజుల క్రితం చంద్రమండలం నుండి తీసిన భూమి ఫోటోలను చూసి దిగ్భ్రాంతుడనయ్యాను. మనిషిని తన ఉనికి నుండి వేరు చేయడానికి అణుబాంబులు అక్కర్లేదు, ఆ పరాయీకరణ ఇప్పటికే వచ్చేసింది. మన సంబంధాలన్నీ కేవలం సాంకేతిక సంబంధాలుగా మారిపోయాయి.”

అది 1960ల నాటి మాట. నేటి స్మార్ట్‌ఫోన్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లని చూసి ఏమనేవాడో ఊహించుకోవచ్చు.

కొడవళ్ళ హనుమంతరావు


18 June 2026 4:56 AM