జీడిగుంట విజయసారథి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
భద్రుడు గారు, గురూజీ సంభాషణలను ఈ జీవనశిల్పి సిరీస్ ద్వారా అక్షరీకరించినందుకు చాలా మటుకు రుణం తీరిపోయిందనే అనుకుంటున్నాను. చాలా చక్కని నివాళి ఇచ్చారు. గురూజీ ఎక్కడున్నా మిమ్మల్ని తప్పకుండా అభినందించి ఆశీర్వదిస్తారు. గురూజీ కంఠస్వరం పరిచయం చేసినందుకు, మీ పోస్టులకు మా స్పందనలు తెలియజేయడం వల్ల కొద్దో , గొప్పో గురూజీ కి మా నివాళులు కూడా సమర్పించిన ఆనందం కలిగించినందుకు మీకు మా ధన్యవాదాలు.
“ఏ రోజైతే మనిషి గుర్తింపు తాపత్రయం వదిలేస్తాడో ఆ క్షణమే ఋషిగా మారిపోతాడు. ఒక అనంతత్త్వంలో, ఆ పరమాత్మలో కలిసిపోతాడు. కానీ అలా గుర్తింపుని వదులుకునేవాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు.” మీ బ్లాగు హైలైట్ స్టేట్మెంట్ గురూజీ ఈ సంభాషణల్లో ఏం చెప్పబోతున్నారో చదవగానే ఇన్నాళ్లుగా ఈ జీవనశిల్పి భాగాలు చదువు మాకు బాగా దగ్గరయిన గురూజీ రవీంద్ర కుమార్ శర్మ గారిలో ఆ ఋషి రూపమే దర్శనమిచ్చింది భద్రుడు గారు.
గురూజీ రామ చరిత మానస్ చౌపాయీ సారాంశాన్ని “ఎవరి మనస్సులో అయితే మోహము కలుగుతుందో, వారి హృదయంలో జ్ఞానవైరాగ్యాలు లేవని అర్థం. ఒకవేళ జ్ఞానవైరాగ్యాలుంటే, అక్కడ మోహం కలగడానికి వీల్లేదు” అంటూ ఎంతో సింపుల్ గా విష్ణు మూర్తి నారదుడి అహంకారానికి పరీక్ష కథ తో మొదలుపెట్టి మధ్యలో శాఖాచంక్రమణం చేస్తూ జ్ఞాన, వైరాగ్యాలు, తపస్సు, ధ్యానాలు, తాత్విక చింతనలు విశ్లేషించి వివరించడానికి ఎన్ని అద్భుతమైన కథలు, ఉదాహరణలు చెప్పారో.
అహం – అహంకారం ఈ రెంటికీ గాక వ్యత్యాసాన్ని విడమర్చి చెప్పిన కథ, ఉప్పు బొమ్మ సముద్రం లో కలిసిపోయి తన అస్థిత్వాన్ని కోల్పోయి జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యే పరమ సత్యాన్ని ఎంత సరళంగా ఆవిష్కరించిందో! మనిషి తన పరిమిత గుర్తింపును కోల్పోయి ఆ అనంతత్వంలో లీనమైనప్పుడే అహమ్ లభిస్తుందనే గురూజీ వివరణ చదివినప్పుడు అహం బ్రహ్మాస్మి లో అహం అనే పదానికి ఇన్నాళ్లు నాకు తెలిసిన అర్థం కాదని అర్థమయింది.
కళాకారులు తమ సన్మానంకోసం, కీర్తికోసం చావుకైనా సిద్ధపడతారనే కళాకారుడు – యముడు కథ ఇంతకు మునుపు నేనెప్పుడు విననే లేదు. ఈ కథ చెప్పాక “నేటి కాలపు కళాకారుడు తన కాన్వాసు ముక్కని మాత్రమే తన ప్రపంచంగా భావిస్తాడు. అతడు పేదరికాన్ని, మురికివాడల్ని పెయింటింగులు వేస్తాడుగానీ, ఆ మురికివాడ గోడని కూడా ఒక కాన్వాసుగా మార్చి దాని అందంగా తీర్చిదిద్దాలనే ఆలోచన అతనికి రాదు.” అంటూ ఆధునిక కాలపు కళాకారులు చాలా మందికి ఉన్న హిపోక్రసీ గురించి గురువు గారు చేసిన విశ్లేషణ అద్భుతం.
ప్లేటో – అరిస్టాటిల్ ఉదంతాన్ని ఉటంకిస్తూ
‘ప్రజలకు ఏది ఇష్టమో దాన్నే మేము సమాజానికి అందిస్తాం అంటారు. కానీ సమాజం దేన్నిష్టపడాలో నేర్పించవలసిన బాధ్యత మీది కదా. అది మీకు తెలుసు కదా. అయినా కేవలం చప్పట్లకోసం ప్రజల బలహీనతలు వాడుకుంటారు. అందుకే మీరంతా బేయీమాన్లు..” అన్న ప్లేటో మాటలు ప్రజలు ఇష్ట పడుతున్నారనే ఇలాంటి సినిమాలు తీస్తున్నాం అనే వాళ్ళ ఇళ్లలో గోడ మీద ఫ్రేమ్ చేసి పెట్టాలి.
బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు ముందుగా సనక, సనందన, సనత్కుమారుల్ని సృష్టించి వారు ఐహిక బంధాలకు జడిసినందుకు వాళ్ళకి శాపం ఇచ్చి ప్రజాపతులను సృష్టించాడాన్న కథ విన్నాను గానీ, కోపంతో ఆయన భృకుటి ముడిచినప్పుడు అక్కణ్ణుంచి ఒక పిల్లవాడు బయటపడి రుద్ర సృష్టి జరిగిందన్న కథ వినడం ఇదే మొదటిసారి. BTW, గురూజీ సనత్సుజాతీయుడు పేరు చెప్పడం మర్చిపోయినట్టున్నారు.
ఇంక నారదుడి అహంకారం అణచివేత కథ లో తనకు జరిగిన పరాభవానికి విష్ణుమూర్తికి ఇచ్చిన శాపం ఫలితమే మరొక కల్పం లో రామావతారం అన్న సంగతి రామ చరిత మానస్ లో “రాముడి అవతారం వివిధ కల్పాలలో వివిధ కారణాల వల్ల జరిగింది. ఒకసారి ద్వారపాలకులైన జయవిజయుల శాపం వల్ల, ఒకసారి కశ్యపుడు-అదితిల వరాల వల్ల, మరొకసారి నారదుడికి కలిగిన మోహం వల్ల, దాని ఫలితంగా ఇచ్చిన శాపం వల్ల కలిగాయి” అని ఉందని చదివిన తరువాతే తెలిసింది. నిజం చెప్పొద్దు కాకభుశుండి పక్షిరాజు పేరు వినడం కూడా ఇదే మొదటి సారి.
చివర్లో గురూజీ పుస్తకం మూసి పఠించిన ఉపనిషన్మంత్రాలు, శాంతిమంత్రాలు—”పూర్ణమదః పూర్ణమిదం…” తన సంభాషణలకు మాత్రమే కాక మీ జీవనశిల్పి సిరీస్ ముగింపు కి కూడా ఒక పరిపూర్ణత చేకూర్చింది
ప్రతి రోజూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ, క్రమం తప్పకుండా చదువుతూ మమేకమై పోతున్న నా లాంటి పాఠకులకు ఇక పై ఈ అమూల్యమైన సంభాషణలను మిస్ అవుతామనే భావన ఏదో మాటల్లో చెప్పలేని వెలితిని మిగులుస్తోంది. 2010లో జరిగిన ఆ నాటి ప్రసంగాల రికార్డింగులను ఇలా మీరు అక్షరబద్ధం చేసి ఇంతటి అద్భుతమైన సాహిత్య, తాత్విక నిధిగా మలిచి మాకు అందించినందుకు మీకు సదా కృతజ్ఞులం భద్రుడు గారు
భద్రుడు గారు, మీరు ఈ సంభాషణల పరంపర లో ప్రతి భాగాన్ని మీదైన శైలిలో భలే సెటప్ చేసి పాఠకులని గురూజీ కళాశ్రమానికి ట్రాన్స్పోర్ట్ చేసి చుట్టూరా ఒక ప్రశాంత వాతావరణం సృష్టించి మరీ చదివిస్తున్నారు. తెల్లవారకముందే ఆశ్రమానికి వెళ్ళడం, గురూజీ దీపం వెలిగించి రామచరిత మానస్ పారాయణం చేయడం, వెదురుపొదలు, వేపచెట్టు మీది పక్షులు కూడా పారాయణం కోసం చెవి ఒగ్గి ఉండటం — చదువుతుంటే మా మనసులో ఒక ఒక అలౌకికమైన ప్రశాంతత చోటు చేసుకుంది.
ఈ సంభాషణలో గురూజీ గురు పరంపర గురించి చెప్పిన ఎన్నో విషయాలు, సందర్భాన్ని బట్టి లేవనెత్తిన ఎన్నో ప్రశ్నలు, చెప్పిన కథలు, అత్యంత విలువైన భారతీయ సంస్కృతి మూలాలతో పాటు అవన్నీ పతనమైన ఈనాటి గందరగోళ సమాజాన్ని కూడా ఏకకాలంలో ఆవిష్కరించాయి. గురూజీ చెప్పినట్టు “ఈ రోజుల్లో ఒక రకమైన గందరగోళం నడుస్తోంది. అదేమంటే మనం మన జీవనశైలిని మర్చిపోయాం. మన జీవనశైలి విలువల్ని మనం మర్చిపోవడం వల్లనే ఈ గందరగోళం తలెత్తింది. వేల సంవత్సరాలుగా మన దగ్గర చాలానే ఉంది. అంత ఉన్నప్పటికీ వాళ్ళు ప్రతి ఒక్క వస్తువుకీ, విషయానికీ కొన్ని పరిమితులు పెట్టుకున్నారు. మనిషికి సౌకర్యాలు ఎంతవరకూ అవసరమో అంతే ఉంచుకున్నారు. కానీ ఈ రోజు సౌకర్యానికి కొలమానం ఏమిటి? అభివృద్ధికి కొలమానం ఏమిటి? ఏం జరిగితే మనిషి అబివృద్ధి చెందినట్లు? దానికేదైనా కొలమానం ఉందా? ఎంత సౌకర్యం ఉంటే నాకు సరిపోతుంది అనుకోడానికి ఈ రోజు ఏదైనా లెక్క ఉందా? లేదు.”
దేనికీ తృప్తి పడని, పడలేని నేటి షో-ఆఫ్ చేసే సమాజాన్ని గురూజీ ఎంత కరెక్ట్ గా వ్యక్తపరిచారో. Whitman ‘Song Of Myself’ Section 32 లో జంతువుల జీవనశైలి గురించి చెబుతూ మానవుల్లాగా వస్తువుల కోసం, లౌకిక సంపద కోసం పిచ్చివాళ్ళలా ప్రాకులాడవంటాడు. “Not one is dissatisfied, not one is demented with the mania of owning things.” గురూజీ
మన ప్రాచీన భారతీయ ‘పరిమితుల సంస్కృతి’ గురించి చెబుతుంటే ఇదే గుర్తొచ్చింది.
నేనెప్పుడో, ఎక్కడో విద్యాభ్యాసం లేదా జ్ఞాన సముపార్జన కోసం బోధకుడు, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఆచార్యుడు, గురువు ఇలా వేర్వేరు వ్యక్తులు ఉంటారని చదివినట్టో, విన్నట్టో గుర్తు. గురూజీ అధ్యాపకుడు, ఆచార్యుడు, గురువు గురించి ఎప్పుడూ కనీ విని ఎరుగని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెబుతుంటే అవన్నీ గుర్తొచ్చాయి.
పరుసవేది కథ; చేప, తాబేలు, పక్షి కథ; అష్టలక్ష్ములలో ధైర్యలక్ష్మి ప్రాముఖ్యత గురించిన కథ; రామ చరిత మానస్ లో రామ-రావణ రథాల గురించి విభీషణుడి సంశయము , రాముడి ధైర్యానికి సంబంధించిన శ్లోకాలు; ఇవన్నీ ఈ జీవన శిల్పి ఇరవై తొమ్మిదో భాగం చదివిన తరువాతే తెలిసాయి.
నేను విన్న ప్రకారం బోధకుడు విద్యార్థిని తయారు చేస్తాడట ( LKG & UKG ఏమో లేదా తల్లి తండ్రులు పిల్లల్ని స్కూల్ కి పంపే ముందర చేసే బోధన ). అధ్యాపకుడు సమాచారాన్ని ఆ విద్యార్థి తలలో పెడతాడట. ఉపాధ్యాయుడు (లేదా ఉపాధ్యాయురాలు): అధ్యాపకుడి కన్నా పై స్థాయిలో ఉండి చదువు మాత్రమే కాకుండా, విద్యార్థి వ్యక్తిత్వాన్ని కూడా గమనిస్తూ, అతని ప్రవర్తనను సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. ఆచార్యుడు కేవలం చెప్పడమే కాదు, తాను చెప్పిన విలువలను ఆచరించి చూపిస్తాడట.
అయితే అత్యున్నతమైన స్థానం గురువుది ( Mentor అనుకోవచ్చేమో) అందుకే కొన్ని విద్యలు గురుముఖతః నేర్చుకోవాలంటారనుకుంటా. గురువు విద్యార్థిలోని అంతర్గత శక్తులను మేల్కొలిపి తొలగించి జ్ఞానోదయం కలిగిస్తాడు.
గురూజీ చెప్పినట్టు “గురువు డిక్షనరీలో ‘ఓటమి’ అనే పదమే ఉండదు. గురువు ఎప్పుడూ ఓడిపోడు. ఒక రాజు ఓడిపోవచ్చు… కానీ అతణ్ణి మళ్ళీ ఎక్కడో ఒకచోటనుండి గురువు నిలబెట్టుకుంటూ వస్తాడు. గురువులో ఆ దమ్ముంది.”
మన చరిత్రలో ఉదాహరణలెన్నో ఉన్నాయి. చంద్రగుప్తుడి వెనుక చాణక్యుడు, హరిహర బుక్కరాయల వెనుక విద్యారణ్యస్వామి, శివాజీ వెనుక సమర్థ రామదాసు నిలబడి సామ్రాజ్యాలకు సామ్రాజ్యాలనే నిర్మించారు. గురూజీ చెప్పినట్టు రాజులు భౌతికంగా ఓడిపోయినా, నైతికంగా, ఆధ్యాత్మికంగా సమాజాన్ని గెలిపించే శక్తి గురువుకు మాత్రమే ఉంటుందన్న సంగతి నిర్వివాదాంశం.
గురువుల పదజాలం లో ఓటమి అనే పదం ఉండదు అని గురూజీ చెబుతుంటే నేను గురువు గారిలా భావించే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పాట పల్లవే నా చెవిలో మార్మోగింది….
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి..
విశ్రమించవద్దు ఏ క్షణం..
విస్మరించవద్దు నిర్ణయం..
అప్పుడే నీ జయం నిశ్చయంరా..
మరొక అద్భుతమైన గురూజీ సంభాషణ మాకందించినందుకు మీకు కృతజ్ఞతాభివందనములు భద్రుడు గారు.
ఈ సంభాషణ కోసం గురూజీ గొంతు సవరించుకునే ముందర ” మేమంతా వేపచెట్టు నీడకి చేరాం. ఎదురుగా ఒక నది ప్రవహించడం లేదు తప్ప నాకు తక్కిన దృశ్యమంతా సబర్మతి ఆశ్రమంలో కూచున్నట్టే అనిపించింది.” అంటూ ఈ జీవనశైలి 28వ వ భాగం చదివే పాఠకులకి ఒక మంచి సెటప్ ఎరేంజ్ చేశారు. దాంతో గురూజీ సంభాషణలు చదువుతున్నా ఆశ్రమంలో ఆయన ఎదురుగా కూచుని వింటున్నట్టే అనిపించింది భద్రుడు గారు.
గురూజీ దైవానికి, మానవుడికి, దానవుడికి మధ్య ఉన్న వ్యత్యాసానికి ఇచ్చిన వివరణ “ఎవరైతే మనకు అన్నీ ఇస్తాడో కానీ తిరిగి మననుంచి ఏదీ ఆశించడో వాడే దేవుడు. ఆయన ముందు మనమేదైనా పెడితే ‘నేను దీన్ని తీసుకోను’ అనని వాడు కూడా. ఎవరైతే ఇతరులనుంచి తీసుకుంటాడో, అలాగే తిరిగి మళ్ళా వాళ్ళకిస్తాడో వాడు మానవుడు. ఎవడైతే ఇతరులనుంచి తీసుకుంటాడుగానీ తిరిగి ఏమీ ఇవ్వడో వాడు దానవుడు” అని గురూజీ ఎంత అద్భుతంగా విడమరిచి చెప్పారు! అందుకే సూర్య చంద్రులకు, పంచభూతాలకు దైవత్వం ఆపాదించి పూజిస్తూ ఉంటామనుకుంటా. అవన్నీ మనకు నిరంతరం ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాయి తప్ప మన్నుంచి ఏమీ ఆశించవు.
మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ తల్లీ, తండ్రి, గురువులను కూడా దైవ సమానులు గా ఎందుకు భావిస్తామో గురూజీ ఉదాహరణలతో మరింతగా అర్థమయింది. అయితే అతిథి దేవో భవ అని కూడా అన్నారుగా.. బహుశా అతిథి కూడా ఏమీ ఆశించకుండా ఏం పెడితే అది తినాలని కాబోలు. మనుషుల తత్త్వం ఒకటి చేసి మరొకటి ఆశించడం అని, దానవుల పని లాక్కూపోయి ఏమీ ఇవ్వక పోవడం అని ఎంత సింపుల్ గా తేల్చేసారో.
ఇక్కడ గురూజీ, తల్లి బిడ్డతో ‘నిన్ను తొమ్మిది నెలలు కడుపులో మోసాను, నీ కోసం ఇంత చేసాను, నువ్వు నా కోసం ఏం చేస్తున్నావని అడగనంతవరకే ఆమెకు దైవత్వం ఉంటుందనడం. చాలా ఔచిత్యం గా ఉంది. ఇలా ఏమీ ఆశించకుండా ఉండే తత్వం గురించి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మా అబ్బాయి నటించిన ఒక సినిమా కోసం రాసిన చాలా ప్రాచుర్యం పొందిన పాటలో కొన్ని పంక్తులున్నాయి.. మీరు వినే ఉంటారనుకుంటాను.
“పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగనంపక ఉంటుందా..”
గురూజీ తను ప్రత్యక్షం గా చూసిన తన ఊరి నాటు వైద్యుడి వినయాన్ని, సరళత్వాన్ని గురించి చెప్తూ మన పూర్వీకుల విద్యలో ‘శీల, సమాధి, ప్రజ్ఞలు’ ముఖ్యమైనవన్నారు. నిజంగా ఆ లక్షణాలు ఎంత అవసరం. పశువుల డాక్టర్ నలుగురు మనుషులు లేరని చేతులు కడుక్కుని, టీ తాగి వెళ్ళిపోతే, ఆ వృద్ధ వైద్యుడు మాత్రం వైద్యం చేసి, ‘ఇప్పుడే ఒక ప్రాణానికి చికిత్స చేశాను కదా, నా ధర్మం ప్రకారం నేనేమీ ఆశించకూడదు, తీసుకోకూడదు’ అని అన్నం కూడా తినకుండా, కలెక్టరుగారి బండిని కూడా తిరస్కరించి నడుచుకుంటూ వెళ్ళిపోవడం లాంటి సంఘటనలు గురూజీ చెబుతుంటే ఒళ్ళంతా ఏదో ఒక ఆశ్చర్యానందానుభూతి కలిగింది.
అలాగే సన్న్యాసం తీసుకోబోయే వ్యక్తి ఊరిలోని వృత్తిపనివారందరి ఇళ్ళకూ వెళ్ళి, ‘నా వల్ల సమాజానికి కొంత ఆర్థిక, వృత్తిపరమైన నష్టం జరగవచ్చు, నన్ను క్షమించండి’ అని వేడుకునే సాంప్రదాయం.. ఇవన్నీ ఎప్పుడు, ఎలా అంతరించిపోయాయో.. ఇంక రథోత్సవంలో ఊళ్ళో అన్ని వృత్తులవారినీ సమానంగా గౌరవించడం గురించి చదువుతున్నప్పుడు… వాల్ట్ విట్మన్ (Walt Whitman) తన ప్రసిద్ధ కవిత ‘I Hear America Singing’ లో —”The carpenter singing his as he measures his plank or beam, The mason singing his as he makes ready for work, or leaves off work…” అంటూ ప్రతి వృత్తికారుడి శ్రమను దైవికమైన సంగీతంగా, సామాన్య శ్రామిక వర్గాన్ని, సమాజాన్ని దైవంగా భావించి కీర్తించిన పంక్తులు గుర్తొచ్చాయి.
మీరు తెలుగులోకి ‘ఆత్మోత్సవ గీతం ‘ పేరుతో అనువదించిన వాల్ట్ విట్మ న్ ‘Song of Myself’ లో కూడా సమాజంలో అట్టడుగున శ్రమించే ప్రతి ఒక్క వృత్తికారుడిని కూడా దైవ స్వరూపులుగా భావిస్తూ ఇలా అంటాడు
“The boatman and hatter and wood-cutter share my love and interest,
The plowman in the field, the driver of the wagon, the sweeper in the street…. The black-smith with grimed and hairy chest, the anvil with its ring…” అంటూ ఆ కమ్మరి శ్రమను, కొలిమి శబ్దాన్ని కూడా అద్భుతంగా స్తుతించారు. ఆయా వృత్తుల శ్రమను, వారి నైపుణ్యాన్ని అంతలా గౌరవించే సంస్కృతి మన గ్రామీణ వ్యవస్థలో ఎప్పటినుంచో ఇలా ఒక జీవన విధానంగా ఉందనే విషయాన్ని గురూజీ చెబుతుంటే చాలా విడ్డూరంగా ఉంది.
ఒకప్పుడు వెదురు పనిచేసేవాడికి, చర్మకారుడికి ఇలా రకరకాల వృత్తుల్లో నిపుణులకు తమ వృత్తికి సంబంధించిన సైన్స్, ఇంజనీరింగ్, జ్యోతిష్యం, వైద్యం అన్నీ తమ ఇంట్లోనే సహజంగా తెలిసి ఉండేవన్న సంగతి గురూజీ చెబుతుంటే నాకంత ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ కి మా ఊరెళ్ళినప్పుడు మా ఊళ్ళో అనేక వృత్తుల్లో ఉన్న అలాంటి చాలా మందిని చూసాను.
ఈ సంభాషణలో నేను తెలుసుకున్న కొత్త విషయం ఏమిటంటే బస్తర్ లోని ఘోటుల్ (Ghotul) వంటి విద్యావ్యవస్థల్లో ఆడ పిల్లలు , మగ పిల్లలు కలసి బతుకు తెరువును, సామాజిక జీవనాన్ని, ఇల్లు కట్టుకోవడాన్ని ఎంతో సులభంగా, ఒకరికొకరు తోడుగా ఉంటూ నేర్చుకునేవారన్న సంగతి. ఘోటుల్ వ్యవస్థ గురించి ఇంటర్నెట్ లో కొంచెం పరిశోధించి మరి కొన్ని విషయాలు తెలుసుకున్నా
ప్రముఖ బ్రిటీష్-భారతీయ మానవ శాస్త్రవేత్త వెరియర్ ఎల్విన్ (Verrier Elwin) 1935 నుండి 1942 మధ్య కాలంలో బస్తర్ ప్రాంతంలోని దాదాపు 347 ఘోటుల్‌లను స్వయంగా సందర్శించారట. ఆయన తన సుదీర్ఘ పరిశోధనలను “ది మురియా అండ్ దేర్ ఘోటుల్” (The Muria and their Ghotul – 1947) అనే ప్రసిద్ధ గ్రంథంలో పొందుపరిచారు. ఘోటుల్‌ను ఆయన కేవలం ఒక గిరిజన నివాసంగా కాకుండా, ఒక ‘గిరిజన విశ్వవిద్యాలయం’ (Tribal University) గా పరిగణించారనీ, “ఆధునిక సమాజం సంస్కారం, క్రమశిక్షణ అని దేన్నైతే పిలుస్తుందో, వాటన్నింటినీ ఏ చదువు రాని గిరిజన యువతకు వారి సొంత పద్ధతుల్లో అత్యంత సహజంగా నేర్పించే ఒక అద్భుతమైన విద్యాసంస్థే ఘోటుల్” అని ప్రశంసించారనీ తెలుసుకుంటే ఆహా ఏమి మా భారతీయ గ్రామీణ సంస్కృతి అనిపించింది.
వేదం గాని, వృత్తిపని గాని “ఎవరి దగ్గరో చదివాం” అని కాకుండా “అతనితో కలిసి చదివాం, కలిసి నేర్చుకున్నాం” అని చివర్లో గురూజీ అన్నట్టు ఆయన సంభాషణలు మీనుంచి మేము వింటున్నట్టు కాకుండా మీతో పాటే మేమూ వింటున్న అనుభూతి మాకు కలిగిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు భద్రుడు గారు.
ఈ జీవన శిల్పి ఇరవై ఏడవ భాగం చదువుతున్నంత సేపు, ఉపోద్ఘాతపు వాక్యాల్లో మీరన్నట్టు శిల్పశాస్త్రం గురూజీ స్వయంగా చదువుకున్నది. గురుముఖతః అభ్యసించింది కాబట్టి సంభాషణ మొత్తం ఆ శిల్పా శాస్త్రమంతా ఒక వాక్ప్రవాహ జలపాత ఝరిలా జాలువారిందా అనిపించింది.
నిజంగానే అంత క్లిష్టమైన విషయాలను ఒక ప్రాథమిక శ్రోతకి ఎంత చెప్పాలో, ఎలా చెప్పాలో, ఏ విధంగా గ్రహించ చేయాలో గురూజీ కి బాగా తెలుసుకుంటాను. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఎంతో ఆకర్షణీయంగా చెప్పారు. రోజూ ఆయన కూర్చునే గురుస్థానం పక్కన ఉన్న నటరాజ విగ్రహం ఇంతకు మునుపు జీవన శిల్పి – 21 వ భాగం లో పంచుకున్న ఫోటోలో ఉన్నదే అనుకుంటా కదండీ.
గురూజీ “పిల్లలు చాలా బొమ్మలు తయారుచేసేవాళ్లు. తమంతట తామే చాలా బొమ్మలు, వాయిద్యాలు చేసేవాళ్లు.” అన్నప్పుడు చిన్నప్పుడు మా ఊళ్ళో మా మామయ్య పిల్లలు, ఊళ్ళో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ తో బంక మట్టితో ఎన్నో బొమ్మలు చేసుకుని ఆడుకున్న రోజులు గుర్తొచ్చాయి.
ఇంతకు మునుపు భాగంలో చిత్ర షడంగాలైన రూపభేద, ప్రమాణ, భావ, లావణ్య, సాదృశ్య, వర్ణికాభంగం అనే ఆరు అంగాలను చిత్రలేఖన కళ గురించిన ప్రస్తావనలో కూడా గురూజీ మాట్లాడారు. అయితే ఈ సంభాషణలో శిల్పకళా రహస్యాలను వివరిస్తూ చెపుతుంటే మరింత అర్థవంతమనిపించాయి.
శిల్పశాస్త్రంలో దేవాలయాల వివిధ శైలులైన ద్రావిడ, నాగర, వేసరాల గురించిన వివరణ, సత్యం, శివం, సుందర తత్వాలకు ఆపాదిస్తూ గురూజీ అన్న మాటలు “సత్యానికి, కళలో చిహ్నం, చతురస్రం. ఎక్కడ వేసినా చతురస్రం చతురస్రమే. శివానికి త్రిభుజాకారం చిహ్నం. ఎక్కడ వేసినా ఒక కోణం పైకి ఉంటుంది. సౌందర్యానికి చిహ్నం వృత్తం. ప్రతి ఒక్క దేవాలయంలోనూ ఈ మూడింటినీ ఉంచుతారు.” చదువుతుంటే, శిల్ప శాస్త్ర విజ్ఞానాన్ని గురూజీ ఏ స్థాయిలో అర్థం చేసుకున్నారో మన స్థాయికి అందే ప్రసక్తే లేదనిపించింది.
ముఖ్యంగా దేవాలయాల కోసం ఉపయోగించే శిలల పరీక్ష చెయ్యడం, రాళ్ళలో లింగ భేదం, మనుషుల కున్నట్టే బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య అవస్థలు ఉంటాయనడం, శిలను ఒక ఔషధంగా మార్చే ప్రక్రియ ‘జలాధివాసం’ వెనుక ఉన్న వైద్య పరమార్థం, గుళ్ళో విగ్రహాన్ని అభిషేకించిన నీటిని తీర్థంగా తీసుకునేటప్పుడు పలికే ‘అకాల మృత్యు హరణం సర్వవ్యాధి వినాశనం’ అనే మంత్రం వెనుక ఉన్న ఆ శాస్త్రీయత, మన పూర్వీకులు దేవతామూర్తులను ఎంతటి ఔషధమయంగా భావించేవారో, తమిళనాడు ఆలయాల్లో విగ్రహాల వెనుక భాగం ఉండకపోవడానికి, భక్తులు ఆ శిలను అరగదీసి మందుగా వాడటం, దేవతల, దైత్యుల, దానవుల, అసురుల, రాక్షసుల ప్రతిమలు తయారు చేయడానికి తాళాల నిష్పత్తులు, పదహారు రకాల గణపతులు, 365 రకాల లింగాలు ( ఏడాదిలో ప్రతిరోజుకి ఒక లింగమా? ) లాంటి ఎంతో అబ్బుర పరచే విషయాలు నేను మొదటిసారి వింటున్నాను.
ఇంక చివర్లో గురూజీ స్వయంగా తయారు చేసిన ‘చాముండ’ శిల్పం గురించి మీరు పంచుకున్న ఫోటో ను “అందులో ఎముకలు తప్ప మరేమీ కనిపించని దేహంతో వెనక్కి వాలి, ఆ దేవత ఈ క్షణమో, మరుక్షణమో ఎదుటివాళ్ళమీద విరుచుకుపడేదిలాగా కనిపిస్తూ అత్యంత భీకరాకృతితో కనబడుతున్నా చూడగానే మనలో భయం కన్నా కూడా ఒకలాంటి ఆరాధన తలెత్తుందంటూ మీరు వర్ణించిన తీరు చదివి చూస్తే ఆ శక్తి స్వరూపిణి నిజంగా అలాగే కళ్ళముందు కదలాడింది.
ఆ శిల్పం అలా మలచడానికి కారణం అడిగితే గురూజీ ‘ఆకలితో మాడిపోతున్న ప్రజల క్రోధానికి ఆమె ప్రతీక. ఆకలిగొన్న నిరుపేదలు ఆగ్రహిస్తే అదిగో అటువంటి శక్తి ప్రభవిస్తుంది’ అనడం మీరు గమనించినట్టే పూర్తిగా ఆయన దర్శనం. ఎన్ని దుర్గ, కాళిమాత, మహిషాసురమర్దిని విగ్రహాలు చూసానో ఇప్పటివరకూ. ఈ శక్తి స్వరూపం మాత్రం గురూజీ తప్ప నిజంగా ఏ శిల్పి, శిల్పశాస్త్రమూ ఇంతవరకూ ఊహించని దేవతా మూర్తి.
మరో గురూజీ మహత్తరమైన సంభాషణ మాకు ఇంత సరళంగా అక్షరీకరించి అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు భద్రుడు గారు.
ఈ సంభాషణ రికార్డు చేయడం కోసం మీరు టేప్ రికార్డర్ చేతిలో పట్టుకుని గురూజీ ముందు కూర్చున్న దృశ్యం కళ్ళ ముందు ఒక్క చిన్న ఫ్లాష్ లాగా మెదిలింది భద్రుడు గారు. శివదత్ గారు, కనకమల్ గాంధీ గారు ఆశ్రమానికి వచ్చి మేము గాంధీజీ గురించి చాలా చదువుతూనే ఉన్నా.. గాంధీజీ చెప్పిన విషయాలు ఇక్కడికి వస్తేనే అర్థమవుతాయనడం, దానికి సమాధానంగా ‘నేనైతే గాంధీని ఎప్పుడూ చదవలేదు. లెనిన్‌ను చదవలేదు, మార్క్స్‌ను చదవలేదు, ఏ సంఘానికి చెందిన ఏ గురూజీ రాసిన విషయాల్నీ చదవలేదు… వీటన్నింటికీ సంబంధించిన ఏ పుస్తకమూ చదవలేదు. నేను చూసింది మాత్రమే నేరుగా చెప్తున్నాను. నేను స్వయంగా చూసినదాన్ని, ఆ విషయాన్ని ఎలాగైతే అర్థం చేసుకున్నానో అలాగే , అంతవరకే చెప్తున్నానడం నిజంగా చాలా ఆశ్చర్య పరుస్తోంది. పుస్తకాలు చదవకుండా, ఏ
సిద్ధాంత గ్రంథాల చట్రంలో ఇరుక్కోకుండా, ఇతరుల భావజాలాల ఉచ్చులో బిగిసిపోకుండా కేవలం లోకాన్ని, సమాజాన్ని, తను పుట్టి పెరిగిన గ్రామాన్ని, అక్కడ మనుషులను, వారి శ్రమను గమనించిన వాళ్ళకే ఇటువంటి తాత్వికత అవగతమవుతుందేమో.
గురూజీ సమాధానాన్ని సమర్థిస్తూ
దలైలామా బృందానికి చెందిన రిన్ పోచే కళాశ్రమం సందర్శించిన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తు చెయ్యడం చాలా బాగుంది . ఆయన ఆశ్రమంలో జరుగుతున్న పని చూసి, గురూజీ చెప్తున్న విషయాలు విని, ‘హింద్ స్వరాజ్ లో ఏముందో ఇక్కడా అదే ఉంది’ అంటే గురూజీ ఆ మాట మీకు చెప్తూ ‘ఏముంది సార్ హింద్ స్వరాజ్ లో? నేనైతే చదవలేదు’ అని అడిగినప్పుడు ‘ఇక్కడేముందో హింద్ స్వరాజ్ లో కూడా అదే ఉంది’ అని మీరనడం గురూజీ తలపెట్టిన జీవన యజ్ఞంఈ దృష్టి లో ఎంత గొప్పదో మీరు చెప్పకుండానే సుస్స్పష్టమయ్యింది.
ఆధునిక ప్రభుత్వాలు, నేటి అర్థిక శాస్త్రవేత్తలు కేవలం మనిషి ఆదాయాన్ని పెంచడం, వెల్ఫేర్ స్కీమ్ ల ద్వారా డబ్బు పంచడం, ప్రణాళికలు, ప్రాజెక్టులు మొదలెట్టడం చూస్తుంటే, మన ప్రాచీన వ్యవస్థ ఆదాయం కోసం కాదు, వ్యయం కోసం నడిచిందని, అప్పటి లభ్యమైన టెక్నాలజీ బలంతో, కళల బలంతో ప్రతి ఒక్కరి ఆహార వ్యవస్థను ఏర్పాటు చేశారనీ, ఆహారానికి పక్కా రక్షణ ఇచ్చారనీ, అన్ని వృత్తుల వారికీ గౌరవ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారనీ తెలుసుకుంటుంటే ఎంతో గర్వంగా అనిపిస్తున్నా ఇండిపెండెన్స్ వచ్చాకా కూడా బ్రిటిష్ వారి ఇన్ఫ్లుయెన్స్ తో బానిస భావం వదలకుండా బాగా బతకడం అంటే బాగా సంపాదించడం అనే పరిస్థితికి ఎదిగామో లేక దిగజారామో అర్థం కావట్లేదు.
ఇరవై కిలోమీటర్ల స్థానిక పరిధిలోనే మనిషికి అన్నీ లభించినప్పుడు, అతనికి బయటి ప్రపంచం గురించిన ఆరాటంగానీ, అశాంతిగానీ ఉండేవి కావు. కానీ ఈ రోజు కార్ఖానాల (పరిశ్రమల) వస్తువులు అమ్ముడుపోవడం కోసం, మార్కెట్ మాయాజాలం మనుషులకు కృత్రిమ అవసరాలను ఎలా సృష్టిస్తోందో గురూజీ చెప్పిన వేపపుల్ల, కోల్గేట్ ఉదాహరణ అద్భుతంగా ఉంది. మన ప్రాచీన గ్రామాల్లో ప్రతి ఇల్లూ ఒక కార్ఖానాగా వర్ధిల్లిందని, బొంబాయి నుండి ప్యాకింగ్ డబ్బాల్లో వచ్చే కాటుక కంటే, ఇంట్లోనే కొబ్బరిచిప్పలో చేసుకునే సహజమైన కాటుకే నాడు ప్రతి ఇంటా ఉండేదని చెప్పడం.. నేను పుట్టిన పల్లెటూరులో అవన్నీ చూసిన రోజులు గుర్తు చేశాయి.
గ్రామాల్లో అవసరాలు తీరాక, మిగిలిన సమయంలో కేవలం ఆనందం కోసం అందమైన కళాఖండాలను సృష్టించి, వాటిని భూమార్గాల ద్వారా ఆఫ్గనిస్తాన్, ఈజిప్ట్ దాకా తీసుకెళ్ళిన ‘సార్థవాహుల’ గురించి, జలమార్గాల ద్వారా సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసిన వారి గురించి గురూజీ ఇచ్చిన వివరణ అద్భుతం. నాకు సార్థవాహులు అనే కొత్తపదం కూడా తెలిసింది.
వ్యాపారం చేసి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు భారతదేశంలో లేని ‘వెండిని’ తెచ్చి కారీగర్లందరికీ సమానంగా పంచేవారని, అలాగే లంబాడాలు తండాలు తండాలుగా నిరంతరం కదులుతూ డ్రై ఫ్రూట్స్, వక్కలు, లవంగాలు వంటి వస్తువులను దేశవ్యాప్తంగా సంతల రూపంలో పంచుతూ, బదులుగా కేవలం పశువుల మేత, తమకు అన్నం మాత్రమే ఆశించేవారని చదువుతుంటే—నాటి వ్యాపారం వెనుక లాభార్జన కంటే పరస్పర సహకారం, మానవత్వం ఎంతగా ఉండేవో అర్థమవుతుంది. టిబెట్ నుండి ఉన్ని తేవడం, గ్రామస్తులతో కలిసి ఐదు రోజుల పాటు విందులు చేసుకున్నాకే బేరసారాలు ముగించి రేటు ఖరారు చేయడం ఎంతటి సంస్కారవంతమైన వ్యాపార శైలో కదండీ భద్రుడు గారు! ఏమయిపోయాయండి ఆ రోజులు.. ఎలా మాయమైపోయాయి.. తలుచుకుంటేనే ఎంత బాధగా ఉందో.
ఇంక మన శాస్త్రాల ప్రకారం రాజులు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా పన్నులు ఎలా వసూలు చేసే వారో.. బ్రిటిష్ ప్రభుత్వం వారు ప్రతి 28 కిలోమీటర్లకూ ఒక సుంకం కేంద్రం పెట్టి, వస్తువులను బట్టి పన్ను వేయడం వల్ల మన సమాజంలో లంచగొండితనం, అవినీతి పెరిగి
ఒక అద్భుతమైన వ్యవస్థ ఎలా తల్లకిందులైందో గురూజీ మాటల్లో ఎంతో హృద్యంగా వ్యక్త పరిచారు.
బనారస్ లో ఇళ్ళ మీద పన్ను వేయడం (1818), గంగ నదిపై బ్రిడ్జి కట్టి, పడవలపై పన్ను వేయడం వల్ల 4,000 పడవలు మూతపడి, 8,000 పడవల కుటుంబాలు ఒక్కసారిగా నిరుద్యోగులై దొంగలుగా, మన దేశంలో ‘కూలి’ అనే పదమే లేని కాలం నుండి, ఎన్నో వృత్తులను వ్యూహాత్మకంగా దెబ్బతీసి వాళ్లను
కూలీలుగా మార్చేసిన వృత్తాంతం చదువుతుంటే గుండె తరుక్కుపోతోంది .
చివర్లో హిందూ స్వరాజ్ పుస్తకంలో Why India lost?’ అనే అధ్యాయంలో గాంధీ గారన్న ‘The English have not taken India; we have given it to them. They are not in India because of their strength, but because we keep them.’ మాటలను Quote చేస్తూ మీరు చెప్పినట్టు మనం ఆధునిక నాగరికతకు బానిసలుగా ఉన్నంతకాలం బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించినా, పరిపాలించకపోయినా మన బానిసత్వంలో ఎటువంటి మార్పూ ఉండనే ఉండదు.
మరొక అద్భుతమైన జీవన శిల్పి భాగాన్ని మాకందించినందుకు ధన్యవాదాలు భద్రుడు గారు.